సెక్యులరిజం - నిజం - మానవ నైజం
Secularism in India means equal
treatment of all religions by the state. With the 42nd Amendment of the
Constitution of India enacted in
1976, the Preamble to the Constitution asserted that India is a secular nation.
ప్రతి ఆదివారం మిత్రుడు చర్చికెళతాడు! మరో మిత్రుడు ప్రతి శుక్రవారం మసీదుకెళతాడు. నాకు కుదిరినప్పుడు నేను గుడికెళతాను. అదిగో నామం పెట్టావ్! గుడికెళ్ళావ్! మతం పాటిస్తున్నావ్! నువ్వు సెక్యులర్ కాదు అని ఒకటే గగ్గోలు. ఈ చిన్ని బుర్రకి లాజిక్ ఎక్కడ మిస్ అవుతున్నానో తెలియట్లేదు. ఊహ తెలిసినప్పటినుంచి అసంకల్పిత సానుకూల చర్యలా తల్లిదండ్రుల్ని వాళ్ళు బతికున్నంతవరకూ ఫాలో అయ్యాను. ఈయన మీ నాన్న అని అమ్మ ఎలా చెప్పలేదో (నాకు తెలిసి ఏ తల్లి చెప్పాల్సిన అవసరం రాదు) మనం పాటించేది హిందూ మతం అంటార్రా అని అమ్మ కూడా చెప్పలేదు. మీరు ఇంగ్లీషులో ఉన్నself-help పుస్తకాలు చదవండి. వాటిలో ధారాళంగా బైబిల్ నుండి ఉదహరిస్తారు. ఎందుకంటే అవి అధిక శాతం అమేరికానుంచి దిగుమతి అయినవి. నేను రాముడు, కృష్ణుణ్ణి ఉదహరిస్తూ, ఒరేయ్ బాబూ ఇవి వాళ్ళ దగ్గరనుంచి నేర్చుకుందామంటే 'ఠాట్! నువ్వు సెక్యులర్ కాదు పొమ్మంటున్నారు.' నాకు ఇప్పుడున్న సెక్యులర్ కావాలని లేదు. ఇంకొంచెం మనిషినవుదామనుకుంటున్నాను.
ప్రతి కంపెనీలోనూ Employee
Engagement అంటే ఉద్యోగులలో బృంద స్ఫూర్తి (Team spirit) నింపడం కోసం కొన్ని సామూహికంగా ఇంట్లో జరుపుకునే పండగలు కూడా ఆఫీసుల్లో జరుపుతారు. నేను పని చేసిన చాలా కంపెనీల్లో వాటిని కార్మికులకు పరిమితం చేసి, ఉన్నత స్థాయి అధికారులు ప్రసాదానికి పరిమితమయ్యేలా వీలైనంతవరకూ చూసేవాణ్ణి.
నమాజ్ చేసుకోవడానికి ప్రత్యేక స్థలం ఉంటుంది. ఇక చర్చికెళ్ళే ఉద్యోగులకు ఆదివారం ఆఫీసుకు రండి అని ప్రత్యేక పిలుపులేమీ వెళ్ళవు కాక వెళ్ళవు. ఇక పాలకుల్లో కూడా సకల బలహీనతల మామూలు మనుషులే. వాడికేదో పొరపాటున అధికారం వచ్చి అందలమెక్కాడని గుడికెళ్ళకూడదు, ప్రజలకు పంగ నామం పెట్టు కానీ, నువ్వు నామం పెట్టుకోకూడదు అని రచ్చ చెయ్యడం; వాడు 'సెక్యులర్' కాదని అచ్చోసిన ఆంబోతుకి ముద్రలు వేసినట్టు ముద్రలేయడం ఇవన్నీ అర్ధం లేని తీర్పులు. అనవసర ఆంక్షలు. నేను నా కుటుంబ క్రమశిక్షణ కోసం, వ్యక్తిగత ఏకాగ్రత, క్రమశిక్షణ కోసం నా ధర్మాన్ని పాటిస్తాను. దానికి నువ్వు ‘మతం’ అని పేరు పెట్టి రచ్చ చేస్తే నాకేం సంబంధం లేదు. ఓ మూడు దశాబ్దాల క్రితం ఈ గోల చూసి నాకు తెలిసిన, పేరున్న విదుషీమణి ఇంట్లో, డ్రాయింగ్ రూంలోనే అన్ని మతాల దేవుళ్ళ ఫొటొలు గోడకు తగిలించారు. పాత్రికేయ మిత్రులొచ్చినపుడల్లా హమ్మయ్య! మేడం సెక్యులర్ అని మురిసిపోయేవాళ్ళు! చెప్పొచ్చేదేంటంటే కులం, మతం కోరి తెచ్చుకోరెవరూ! అవి పుట్టుకతో వస్తాయి! వాటి ద్వారా వచ్చే సల్లక్షణాలను పాటించాలి కానీ, స్వార్ధ మానవులు చొప్పించిన దుర్లక్షణాలను పాటిస్తూ సమాజానికి ఇబ్బందికరంగా మానవుడు తయారు కాకూడదు! సంస్కృతంలో ఉన్న పుస్తకాలు చదవను; జ్ఞానమంతా ఇంగిలిపీసులోనే ఉంది అనే మూర్ఖ జనానికి నే చెప్పేదేమీ లేదు. జీవనోపాధికి పనికొచ్చే జ్ఞానమంతా ఆంగ్లంలో ఉంటే; ఈ ఉపాధితో (శరీరంతో) మనశ్శాంతితో జీవించే అక్షర సాధనాలన్నీ సంస్కృతంలో ఉన్నాయ్! ద్వాపర యుగంలో మాతృభాష సంస్కృతం కాబట్టి అప్పటి భగవద్గీత సంస్కృతంలోనే ఉంటుంది. నాటి మాతృభాష ఇంగ్లీషనుకోండి; చెప్పేదేముంది భగవద్గీత ఇంగ్లీషులోనే ఉండేది. నాకు భగవద్గీతలో Human Resources Management
(HRM) అంటే మానవ వనరుల నిర్వహణ కనిపించింది. శ్రీ కృష్ణుడి కంటే గొప్ప HR Manager ఎవడున్నాడీ లోకంలో! జర్నలిజం కనిపించింది. శిక్షణ కనిపించింది. శిక్ష కనిపించింది. రాజనీతి కనిపించింది. రాజకీయం కనిపించింది. దౌత్యం కనిపించింది. లౌక్యం కనిపించింది. అలాగే బైబిల్లో లేని, మానవ జాతికి ఉపయోగపడని జ్ఞానం లేదు. అణగారిన జనాన్ని కరుణతో, త్యాగంతో ఒక్క తాటి మీద నడిపించిన ఏసు ప్రభువు కంటె రాజెవడున్నాడు? అలాగే ఖురాన్ లో సైతం మనిషి మనిషిగా జీవించడానికి అవసరమైన పరజ్ఞానం, పరిజ్ఞానం అన్నీ ఉన్నాయ్. అవి ఇప్పుడు భజన విధానానికి, వివాద స్థాయికి చేరుకున్నాయ్.
We have learnt to divide and rule
from British and doing it still in the name of secular rule and religion. You
divide and rule not to let people live and let live and live in harmony. You divide and rule only to divide and fool
people. Religion is individualistic. Encourage religion as individual practice.
పాలకుల్ని మంచి చేసుకోని వాడికి పుట్టగతులుండవ్. ఆ క్రమంలో కాళ్ళమీద పడ్డాలూ; చేతులు కళ్ళకద్దుకోడాలూ; ముద్దుపెట్టుకోడాలూ, కౌగిలింతలూ
అన్నీ వర్ధిల్లుతాయ్. వ్యక్తిగత సాధనకు, క్రమశిక్షణకు మూలమైన ధర్మకారణమైన మతాలను పాలక వ్యవస్థీకృత మనస్తత్వంతో చూడరాదు. ఆ లంపటంలో అచ్చమైన మనుషులు పడరాదు. మతం వ్యక్తిగతం; అది సామాజికం కాదు. ప్రతి వ్యక్తీ ఒకే మతాన్ని పాటించలేడు. అది అతను ఎంచుకున్నది కాదు. ఈ కారణమే నాకు చెప్పి ‘మరి మా మతంలోకొస్తావా’ అని నన్ను అడిగిన మిత్రులు కూడా ఉన్నారు. ‘మతం మార్చుకుంటా బాబా’ అని షిరిడీ సాయి బాబాను అడిగినప్పుడు ‘నీ అబ్బను మార్చుకుంటావట్రా’ అని షిరిడీ సాయిబాబా ఒక భక్తుడి చెంప పగలకొడతారు కూడా! వ్యవస్థీకృతమైనదేదైనా ప్రయోజనాన్ని, ప్రచారాన్ని ఆశిస్తుంది. ఒక కంపెనీని ఎవరైనా లాభాలకోసమే స్థాపిస్తారు. అలాగే మతాలు, మఠాలు కూడా! ఇవి వ్యవస్థీకృతమైనప్పుడు లాభం మామూలు మానవుడి గూబల్లోకొస్తుంది. వ్యవస్థ శ్రమైక జీవన సౌందర్యాన్ని బలి కోరుతుంది. వ్యక్తి త్యాగం చేస్తాడు. భవిష్యత్తులో బతకాలనే భయంకర స్వార్ధముంటే తప్ప ఏ మనిషీ ఒక వ్యవస్థను స్థాపించాలన్న కాంక్షను సాకారం కావాలని కాంక్షించడు.
యథా రాజా; తథా ప్రజా! పాలకులు చేసేవన్నీ వ్యవస్థీకృతంగా, విభజన విధానంతో ఉంటాయ్. ఒక మనిషిని ఒక ఓటుగా పరిగణించే పాలక వర్గాలు వారి అంతశ్చేతన మీద దాడికి, అంతర్గత మార్పుకి మతాన్ని ఉపయోగించడం ఈ దేశానికి కొత్త కాదు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా బాల గంగాధర తిలక్ తొలిసారి గణేష్ ఉత్సవాలను 'మాస్' స్థాయిలో నిర్వహించి అందరినీ ఒక తాటిమీదకు తీసుకొస్తారు. నేటి మార్క్సిస్టులకు ఇటువంటి ఐడియాలు పనికి రావు మరి ప్రజలను ఆకర్షించడానికి! కాలంతో పాటు మానవత్వ స్థాయి కూడా మారింది కానీ; కార్మిక జీవన మర్మం తెలియలేక, కాలంతోపాటు కనుమరుగవడానికి ఎర్ర పార్టీలు సిద్ధమవుతున్నాయ్.
ఎడతెగని ఎర్ర పార్టీల గోల అలా ఉంచితే, ఇప్పుడు నడిచే మత వ్యవస్థలన్నీ స్వార్ధ శిష్యులు రాజకీయ పార్టీల్లా కొనసాగిస్తున్నవే గానీ అవి మనిషి ఉన్నతికి ఉపయోగపడ్డ దాఖలాలు చాలా తక్కువ. ప్రతి మతం, మఠం చాలా ఖరీదైనవి. ఆస్తిపాస్తులున్నవి. పన్నుల రాయితీలతో ఆస్తులు పెంచుకుని
ఆపన్నులను పక్కదోవ పట్టిస్తున్నవి. మీరు గమనిస్తే ప్రతి మఠాధిపతి కూడా చాలా పుష్టిగా ఉంటారు. కొన్ని మఠాల్లో, పీఠాల్లో
విగ్రహ పుష్టి; నైవేద్య నష్టి తరహాలో కూడా ఉంటారు. వ్యక్తిగత క్రమశిక్షణకు దోహదం చేస్తూ, తద్వారా సమాజ శ్రేయస్సుకుపయోగపడే సంస్థలు మిగులుతాయి. తక్కినవి పేలపిండిలా గాలికి కొట్టుకుపోతాయ్! మతాన్ని వ్యక్తి స్థాయికి పరిమితం చేస్తేనే వ్యవస్థలో మార్పొస్తుంది. సామూహికంగా ఆచారాలు పాటించచ్చేమో కానీ, వ్రతాలు, భజనలు చెయ్యచ్చేమో కానీ అవి మనశ్శాంతికి దొహదం చెయ్యవు. పైగా వైమనస్యాలకు దారి తీసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయ్. ప్రతి మతాచారం ఒక వ్యాపారమై వాటి స్ఫూర్తి, లక్ష్యం ఎప్పుడో దెబ్బ తిన్నాయ్. ఉదాహరణకు సామూహిక ఉపనయనాలు! ఇలా ప్రతి మతంలోను ఏదో ఒక స్వార్థ ప్రకృతి చేరి మానవ జాతికి మనశ్శాంతిని దూరం చేశాయ్. దేశభక్తికి, జాతీయవాదానికి, మత వాదానికి తేడా తెలుసుకుని మానవుడు మసలుకోవాలి.
విచక్షణతో వీటిని వదిలించుకోకపోతే మతం కాలకూట విషమై మనిషిని మింగేస్తుంది. అప్పుడు జనాలుండరు. విభజనలుండవు. భజనలు మాత్రమే ఉంటాయ్. స్వస్తి!


Comments
Post a Comment